*లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్ల నిర్మాణాలు.
*ఉండలేక.. వెళ్లలేక.. సతమతం.
*దట్టంగా పెరిగిన కరకంప చెట్లు
*విషపురుగులతో భయభ్రాంతులకు గురవుతున్న కాలనీవాసులు.
కంచికచర్ల ఫిబ్రవరి 24(తెలుగు తేజం)కొత్త కాలనీలు కాదు. కొత్తగా ఊర్లే ఏర్పడుతున్నాయి.వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్క నేత నుంచి వచ్చిన మాటలు… అయితే ఇప్పుడు ఆయా కాలనీలలో పరిస్థితులు గమనిస్తే కనీసం చిట్టడవులను తలపించేలా ఆయా కాలనీలు ఉన్నాయి. నాయకుల మాటలు నమ్మి ఇళ్ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారుల బిక్కుబిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన జగనన్నకాలనీలు… అప్పటి అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఇళ్ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్ళ నిర్మాణం చేసుకున్న లబ్దిదారులు కనీస వసతులు కూడా లేకపోవటం తో అక్కడ ఉండలేక… అక్కడ ఇంటిని వదిలి మరలా అద్దె ఇళ్లల్లోకి రాలేక సతమతమవుతున్నామని లబ్ధిదారులు వాపోయారు. అప్పట్లో అధికారులు, ప్రజా ప్రతినిధుల మాటలు నమ్మి నిలువునా మోస పోయామని లబ్దిదారులు లబోదిబో అంటున్నారు. అన్ని వసతులు కల్పన పూర్తయిన తరువాతనే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం, గృహ ప్రవేశాలు జరుగుతాయని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్పారన్నారు. ఆచరణలో మాత్రం పరిస్థితి వేరుగా మారిందన్నారు. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక లబ్ధిదారులు హడావుడిగా ఇళ్ల నిర్మాణం చేసుకున్నామని, లబ్ధిదారులు వెంటనే లేఔట్ లో ఇల్లు నిర్మాణాలు చేపట్టకపోతే స్థలాలు వేరే వాళ్ళకి కేటాయించడం జరుగుతుందని అధికారులు పదేపదే చెప్పటంతో లక్షల్లో అప్పులు తీసుకొచ్చి ఇల్లు నిర్మాణాలు చేపట్టామని కనీసం మౌలిక వసతులు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు తెలిపారు. గ్రామానికి సుమారు 2కి.మీ దూరంలో జగనన్న కాలనీ రహదారులు సరిగా లేక రవాణా వసతి కూడా లేదన్నారు. వర్షం పడితే కాలనీకి వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు. దీంతో ప్రస్తుతం కొంతమంది లబ్ధిదారులు మాత్రమే నివాసం ఉంటున్నారు. దీంతో రాత్రి సమయంలో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నా మన్నారు. విద్యుత్ సౌకర్యం మినహా మిగిలిన ఎలాంటి కనీస వసతుల కల్పన జరగలేదన్నారు. కనీసం గ్రావెల్ రోడ్లు, డ్రైన్‌లు, తాగునీటి వసతుల కల్పించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని లబ్ధిదారులు ధ్వజమెత్తుతున్నారు. చిన్న పాటి వర్షం పడ్డా కాలనీలలో నడిచే పరిస్థితి లేదన్నారు. కూలి పనుల కోసం గ్రామానికి వచ్చే పరిస్థితి కూడా లేదని, పిల్లల చదువు కోసం కూడా రాలేని పరిస్థితి రహదారి ఏర్పడిందన్నారు. నాడు వైసీపీ పాలకులు చేసిన నిర్లక్ష్యం లబ్ధిదారులకు శాపంగా మారి ఇప్పటికీ నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్త గ్రామాలు కాస్తా చిట్టడవులుగా మారాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.కూటమి ప్రభుత్వమైన మౌలిక వసతులు కల్పించాలి…..ప్రధానమంత్రి ఆవాస్ యోజన_ఎన్టీఆర్ కాలనీ గా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం కాలనీలో నివాసాల మధ్య దట్టంగా పెరిగిన కంప చెట్లతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని విషపురుగులు సంచరించడంతో భయాందోళనలు చెందుతున్నామని తక్షణమే అధికారులు దట్టంగా పెరిగిన కంప చెట్లను తొలగించి, అంతర్గత రోడ్లు నిర్మాణాల కొరకు చర్యలు చేపట్టాలన్నారు, కాలనీకి వచ్చే ప్రధాన రహదారి నుండి కాలనీకి రాత్రిపూట రావడానికి వీధిలైట్లు లేక బిక్కుబిక్కుమంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని తక్షణమే కరకంప చెట్లు తొలగించి ఇల్లు నిర్మాణాలు చేసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అదేవిధంగా కాలనీకి వచ్చే రహదారి పక్కన వీధిలైట్లు ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.