ఇంద్రకీలాద్రి పై మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు APITCO లిమిటెడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఈరోజు మధ్యాహ్నం విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శివనాద్ గారి సూచనల మేరకు,APITCO మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ మెహ్రా నేతృత్వంలోని ఈ బృందం ఆలయ అధికారులతో కీలక చర్చలు జరిపింది.
ప్రతిపాదిత నూతన క్యూ లైన్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ భవనానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీపై ఈ బృందం ఆలయ ఈఓ శ్రీ శీనానాయక్ మరియు చైర్మన్ శ్రీ బి. రాధాకృష్ణ (గాంధీ )తో చర్చించింది.
అన్నదానం కాంప్లెక్స్ మరియు సెల్లార్ స్పేస్ వినియోగంపై బృందం కీలక సూచనలు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలు రూపొందుతున్నాయి.
ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ (APITCO) సేవలను ఆలయ అభివృద్ధికి వినియోగించుకునేలా చేయడంలో ఎంపీ కేశినేని కీలక పాత్ర పోషించారని బృందం పేర్కొన్నారు. ఆలయ ఆధ్యాత్మికత దెబ్బతినకుండా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక హంగులతో మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమాదేవి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.