
వైద్య శిబిరాలు 2వ తేదీ వరకు కొనసాగింపు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండియన్ వెల్లడి
ఈనెల 17 నుంచి ప్రారంభమైన “స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా ఆదివారం వరకు సుమారు 16 లక్షల మంది మహిళలు, బాలబాలికలు, చిన్నారులకు పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండియన్ నేడొక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న8,050 వైద్య శిబిరాల ద్వారా 8 రకాల పరీక్షలను ఉచితంగా చేశామన్నారు. మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఇతర స్క్రీనింగ్ పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. ముందస్తు పరీక్షల ద్వారా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వారికి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 34,460 మందికి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(పిఎంజెఎవై) హెల్త్ కార్డుల్ని జారీ చేశామన్నారు.వచ్చే నెల 2వ తేదీ వరకు వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఉప ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని బోధనాసుపాత్రుల్లో కూడా ఏర్పాటు చేశామన్నారు.