గ్రామ –వార్డు సచివాలయ ఉద్యోగుల పోరాట బాట

అప్పుడు బతకలేక బడిపంతులు – ఇప్పుడు సావలేక సచివాలయ ఉద్యోగి

మచిలీపట్నం, (తెలుగుతేజం బ్యూరో రిపోర్టర్):

2019లో ప్రారంభమైన గ్రామ–వార్డు సచివాలయ వ్యవస్థ వేలాది నిరుద్యోగ యువతకు ఆశాకిరణం అయింది. పేద, మధ్యతరగతి కుటుంబాల కలలు నెరవేరినట్లుగా అనిపించింది. తల్లిదండ్రులు అప్పులు చేసి చదివించిన పిల్లలు చివరకు ఉద్యోగం సంపాదించారని ఆనందపడ్డారు.కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ప్రారంభంలో ఇచ్చిన స్టైఫండ్, తరువాత కూడా తక్కువ పేస్కేల్ ఉద్యోగులను ఆర్థిక బానిసలుగా మార్చింది. ఇల్లు అద్దెలు, పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు, తల్లిదండ్రుల బాధ్యతలు—ఏదీ తీరలేని స్థితి. పైగా ప్రతి రోజూ సర్వేల పేరుతో ఇంటింటికీ తిరగాల్సి రావడం, గౌరవం కోల్పోవడం—ఇది సచివాలయ ఉద్యోగుల దినచర్య అయిపోయింది.ఇప్పుడు “సేవ చేస్తున్నాం కానీ జీవితం సాగడం లేదు” అనే ఆవేదన ప్రతీ ఉద్యోగి పెదవుల మీద ఉంది.అందుకే సచివాలయ ఉద్యోగులు మౌనంగా ఉండకుండా పోరాట బాట పట్టారు. సమానమైన పేస్కేల్, ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన పని పరిస్థితులు కావాలని అడుగుతున్నారు.వారి డిమాండ్ ఒక్కటే:“సేవ చేస్తూ సతమతమవ్వడం కాదు, గౌరవంగా బతకడానికి సరిపోయే జీతం కావాలి.”ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరేవరకు ఈ పోరాటం ఆగదని చెబుతున్నారు ఉద్యోగులు.ఇది ఒక ఉద్యోగుల పోరాటం మాత్రమే కాదు—వేలాది కుటుంబాల భవిష్యత్తు కోసం సాగుతున్న జీవన యుద్ధం.

తెలుగుతేజం ప్రత్యేకకథనం:

అప్పుడు బతకలేక బడిపంతులు – ఇప్పుడు సావలేక సచివాలయ ఉద్యోగి

అనగనగా ఒక మారుమూల గ్రామంలో పార్వతమ్మ శివయ్య అనే దంపతులు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు. ముగ్గురిని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివించారు. ఆ తరువాత పై చదువులకు పట్నం వెళ్ళవలసి రావడంతో ఆడపిల్లల్ని చదువు మాన్పించారు. మగ పిల్లాడి మీద ప్రేమ తోనో లేక కుటుంబాన్ని ఉద్ధరిస్తాడనే ఆశతోనో పట్నం పంపించి చదివించారు. కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే కుటుంబం అంతా బాగు పడుతుంది అనే ఆశతో కళ్ళన్నీ కొడుకు మీదనే పెట్టుకుని బతుకుతున్న పార్వతమ్మ శివయ్య లకు కొడుకు సంతోషం తో పరుగులు తీస్తూ వచ్చి , అమ్మా ఇన్ని రోజుల మన కష్టం ఫలించబోతుంది అమ్మా… ప్రభుత్వం వారు లక్షా ముప్పైవేల ఉద్యోగాలు ఇస్తున్నారంట అమ్మా… నేను ఇన్ని సంవత్సరాలు చదివిన చదువుకు ఫలితం దక్కబోతుంది అమ్మా… అని చెప్పగానే…. పార్వతమ్మ కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుని కొడుకుని దగ్గరకు తీసుకుని మంచి విషయం చెప్పావయ్యా మీ నాన్న పడిన కష్టాలు నువ్వు పడకూడదు బాబు. పగలనక రేయనక కూలి నాలి చేసుకుని మిమ్మల్ని ఎలాగో పెంచాడు. మీ చెల్లెళ్ళ పెళ్లి బాధ్యతలు నీవే బాబు. ఎలాగైనా కష్టపడి ఈ ఉద్యోగం సంపాదించి మన కుటుంబాన్ని కష్టాల నుండి గట్టెక్కించు బాబు అని చెప్పింది తల్లి.
ఎన్నో సంవత్సరాలనుండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతూ నోటిఫికేషన్ లు లేక , ఒక వేళ ఉన్న ఒకటి రెండు ఉద్యోగాలతో వచ్చే నోటిఫికేషన్ లతో ఉద్యోగాలు లేక అలసి అలమటించిన ఉద్యోగార్థులందరికీ ఒక చిన్న చిరుదివ్వె లాగా సచివాలయాల లో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. పండుగ వాతావరణం లాగ ఒక నెల రోజుల హడావిడి లో ఉద్యోగాలు ఇచ్చేసింది ప్రభుత్వం. లక్షల మందితో పోటీ పడి ఎట్టకేలకు పార్వతమ్మ శివయ్య ల కొడుకు తో పాటు ఎంతో మంది పేద మధ్య తరగతి కుటుంబాలలో ఆడపిల్లలకి , మగపిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. సాప్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ లక్షల జీతాలు కూడా వదులుకుని ప్రభుత్వ ఉద్యోగం మీద మక్కువ తో గౌరవం తో సచివాలయాల ఉద్యో గాలలో చేరారు.
పార్వతమ్మ శివయ్య ల కుటుంబ ఆనందానికి అవధులు లేవు. కానీ రెండు సంవత్సరాలు చాలి చాలని స్టైఫండ్ తోనే నెట్టుకు రావాలి అని బాధ అనిపించినా….. రెండు సంవత్సరాలు కష్టపడితే మంచి జీతం వస్తుంది అని ఆశతో ఉద్యోగాల్లో చేరిపోయారు అందరూ. వచ్చే జీతం లో సగం పెట్రోల్ కి, ఛార్జీల పోతున్నా మిగిలిన సగం జీతం తో ఎలా గొలా అప్పులు చేసుకుంటూ బతుకుతున్న కుటుంబాలు అక్షరాలా లక్షాముప్పై.
అంతలోనే రెండేళ్లు గడిచాయి. పార్వతమ్మ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి , చిన్న ఇల్లు కట్టుకోవాలి అని గంపెడు ఆశలతో కొడుకు వంక చూస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కొడుకు ఉన్నాడు. రెండేళ్లలో మంచి జీతం అన్నది మూడేళ్లు గడిచింది. అందరూ విసిగిపోయి ప్రభుత్వం పై పోరు బాట పడితే అందరి కన్నా తక్కువ పేస్కేల్ క్రియేట్ చేసి మరీ చిన్న చూపు చూసింది ప్రభుత్వం. ఇంకా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి మరల మరల మోసపోతూనే ఉన్నారు సచివాలయ ఉద్యోగులు.
ఇప్పటికీ ఆరేళ్లు గడిచాయి. తల్లి తండ్రుల కోరిక మేరకు ఇల్లు కట్టి అప్పుల పాలైన వారొకరు, భార్యా పిల్లల్ని పోషించడానికి, ఇంటి అద్దె కట్టుకోడానికి , పిల్లల ఫీజులకు , మధ్య మధ్య వచ్చే అనారోగ్యాలకు సరిపోని జీతంతో అప్పుల పాలైన వారొకరైతే, చెల్లెళ్ళ పెళ్లి కోసం అప్పులు చేసి తీర్చలేక , తల్లితండ్రులకు మొహం చూపించ లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వారు మరొకరు.
నిత్యావసరాలు కూడా తీర్చుకోలేని పేరుకు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పుకుని తిరిగే సచివాలయ ఉద్యోగి కి ఆర్థిక ఇబ్బందులు చాలవన్నట్టు , ప్రతి రోజూ ఉద్యోగం పేరుతో , సర్వే ల పేరుతో ఇంటింటికీ తిరిగి తిరిగి కనీస గౌరవమర్యాదలు కూడా కోల్పోయి చేవ జచ్చి, చేతకాని సచివాలయ ఉద్యోగిగా , ప్రతి రోజూ చులకన చేయబడుతూ చావలేక బతక లేక…… బతికి ఏడ్వలేక…… చచ్చి ఓడలేక…. బతుకుతూ చస్తున్న , చస్తూ బతుకుతున్న ……… సచివాలయ ఉద్యోగుల దీనగాధలు ఎన్నెన్నో….. పార్వతమ్మ శివయ్య లు ఎందరెందరో……..

_ ఓ సచివాలయ ఉద్యోగి

అవ్వారు కృష్ణ కుమారి
వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మచిలీపట్నం రూరల్

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *