
మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మవారిని చూసేందుకు రాష్ట్రం నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. జై దుర్గా భవాని నినాదాలతో ఇంద్రకీలాద్రి ప్రాంగణం మార్మోగిపోయింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు లక్షకు పైగా భక్తులు దర్శనం పొందారు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మొత్తం నాలుగు క్యూ లైన్లు సజావుగా సాగాయి.దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆలయ ఈఓ సహా అధికారులు ముందస్తు జాగ్రత్తలతో సమన్వయంగా పనిచేయడంతో పగడ్బందీ ఏర్పాట్లు ఫలితం చూపించాయి. ఎంత మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా దర్శనం కొనసాగింది.దసరా ఉత్సవాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.